Sootigaa.com

Straight to the point.

ఏపీలో మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

1 min read

ఏపీలో మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు మొత్తం 13 జిల్లాల్లో ఉన్న 14 కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఇవి కొనసాగాయి. వంద మంది అధికారులు 14 బృందాలుగా మెరుపుదాడులు చేశారు. మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతున్న రకరకాల అక్రమాలు ఈ దాడుల్లో వెలుగుచూశాయి. ఈరోజు కూడా కొన్ని చోట్ల దాడులు కొనసాగే అవకాశముంది. అవినీతిపై ఏపీ ప్రభుత్వం కొరడా జులిపిస్తుంది. వరుస తనిఖీలు, సోదాలతో ఏసీపీ అవినీతిపై యుద్ధం ప్రకటించింది. తాజాగా మున్సిపల్ కార్యాలయాలను అవినీతి నిరోధక శాఖ టార్గెట్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరిగాయి. 13జిల్లాలో ఉన్న 14 కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు... 2లక్షల 87 వేల నగదును పట్టుకున్నారు. గుంటూరులో అత్యధికంగా లక్ష రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఏదో ఒక కార్యాలయంలో దాడులు చేయగా విశాఖలో మాత్రం గాజువాక, మధురవాడ రెండు కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు జరిగాయి.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన తనిఖీల్లో లక్ష నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు కార్యకలాపాలు సాగిస్తున్నారని గుర్తించారు. ఆఫీసులో పలు అక్రమాలు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చాయి. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగిన తనిఖీల్లో 8వేల 940 రూపాయల నగదు గుర్తించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్పొరేషన్ 15వేలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ సిటి ప్లానర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రైవేటు వ్యక్తిని గుర్తించారు. 13 లక్షల రూపాయల అడ్వటైజింగ్ టాక్స్ వసూలులో ఏడాదిగా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తేల్చారు. అనధికార కట్టడాల పట్ల చర్యలు తీసుకోకపోవడం , సిటిజన్ చార్ట్‌ను పాటించకపోవడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగిన తనిఖీల్లో 24 బిల్డింగ్స్‌కు BPS ధరఖాస్తులను పెండింగ్ లోనే ఉంచినట్టు గుర్తించారు. తాడేపల్లి గూడేం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయవాడ, మధురవాడ, గాజువాకల్లోనూ లెక్కల్లో చూపని నగదును అధికారులు గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తులు పనిచేస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2లక్షల87వేల263 రూపాయల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు , కావాలనే అనుమతులను పెండింగ్‌లో ఉంచటం, నిర్ణీత సమయం ముగిసినా అనుమతులు మంజూరు చేయడం వంటి అక్రమాలను గుర్తించామని అధికారులు తెలిపారు.

error: Content is protected !!